ఆరని కాష్టం… ఆరిజన్ వివాదం..
-బెల్లంపల్లి ఎమ్మెల్యేపై నిత్యం ఆరోపణలు
-వీడియోలు, సోషల్‌మీడియాలో దుమారం
-చివరకు హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు
-ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తామంటున్న ఆరిజన్ నిర్వాహకులు
-దుర్గం చిన్నయ్యకు తప్పని కష్టాలు
-ఎన్ని చేసినా తమ నేతదే విజయమంటున్న చిన్నయ్య అనుచరులు
Mla Durgam Chinnayya: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు సంబంధించిన ఆరిజన్ వివాదం అసలే సద్దుమణగడం లేదు. రావణకాష్టంలా అది మండుతూనే ఉంది. అలా మండుతూనే ఉంది అనేకంటే ఆరిజన్ నిర్వాహకులు దానిని ఆరనివ్వకుండా నిప్పు రాజేస్తున్నారని అనడం సమంజసంగా ఉంటుంది. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి నిత్యం ఏదో రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఆరిజన్ నిర్వాహకులు, ఎన్నికల్లో తమకు జరిగిన అన్యాయంతో పాటు గడపగడపకు తిరిగి చిన్నయ్యకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెబుతున్నారు. అయితే, ఇవన్నీ అనవసరపు ఆరోపణలని తమ నేతను కావాలనే బద్నాం చేస్తున్నారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ఘంటాపథంగా చెబుతున్నారు.
ఆరిజన్ డైరీ విషయంలో రోజుకో వివాదం సోషల్‌మీడియాకు ఎక్కుతోంది. ఆరిజన్ నిర్వాహకులు నిత్యం వీడియోలు విడుదల చేస్తూ దుర్గం చిన్నయ్య మీద ఆరోపణలు సంధిస్తున్నారు. మొదట ఆ సంస్థ నిర్వాహకులు ఓ ఆడియో, కొన్ని వాట్సప్ చాటింగ్ వివరాలు బయటకు రావడం సంచలనంగా మారింది. ఆ తర్వాత నిర్వాహకురాలు షెజల్ ఓ వీడియో విడుదల చేశారు. బెల్లంపల్లిలో ఆరిజిన్ పాల సంస్థను ప్రారంభించడానికి తమ వద్ద భారీగా ముడుపులు తీసుకొని తమ మీదనే ఉల్టా కేసులు పెట్టించాడని ఆరోపించారు. ఆయనకి తెలిసిన వ్యక్తులను ఇందులో షేర్ హోల్డర్స్ గా ఉంచాలని ఎమ్మెల్యే చెప్పారని, తాము ఒప్పుకున్నామన్నారు. తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని, అమ్మాయిలను పంపించాలని కోరితే బ్రోకర్ల ద్వారా అమ్మాయిలను సైతం పంపిచినట్లు వెల్లడించారు.
ఆరిజన్ నిర్వాహకుల్లో ఒకరైన ఆదినారాయణ సైతం మరో వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యేపై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని దానిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాము చెప్పినవన్నీ నిజాలేనని స్పష్టం చేశారు. తమ వద్ద విడతల వారీగా రూ. 30 లక్షలు తీసుకున్నారని దుయ్యబట్టారు. లేఖలు, వీడియోలు విడుదల చేసిన ఆదినారాయణ చివరకు కోర్టు మెట్లెక్కారు. పోలీసులు, ఎమ్మెల్యే చిన్నయ్యను ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆరుగురిని ప్రతివాదులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. చిన్నయ్య తమను బెదిరింపులకు గురిచేయడంతో పాటు, తమపై పోలీసుల సాయంతో ఒకేరోజు పది కేసులు పెట్టించారని కోర్టుకు విన్నించారు.
ఇక మరోవైపు దుర్గం చిన్నయ్యకు మావోయిస్టులు సైతంవార్నింగ్ ఇచ్చారు. వెంటనే తన తీరు మార్చుకోక పోతే.. ప్రజల చేతిలో శిక్ష తప్పదని అన్నలు ఆయన్ని హెచ్చరించారు. ఎమ్మెల్యేకు డెయిరీ నిర్వాహకులు అమ్మాయిలను సరఫరా చేయడం వాస్తవమని, రైతుల నుంచి వసూళ్లు చేసిన డబ్బులు వెంటనే చెల్లించాలని.. లేకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని మావోయిస్టు నేత ప్రభాత్ హెచ్చరించారు. కొద్ది రోజుల కిందట మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా సైతం బీజేపీ నేతలు దుర్గం చిన్నయ్యపై రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసులు ఆ ఫ్లెక్సీలను తొలగించినప్పటికీ పెద్దఎత్తున ప్రచారం కొనసాగింది.
ఇదంతా ఒక్కెత్తు కాగా, హైదరాబాద్‌లో తాజాగా వెలిసిన ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను టార్గెట్ చేస్తూ వరుస ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అది కూడా బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంతో సహా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదురుగా, హైదర్ గూడా ఎమ్మెల్యే క్వార్టర్స్, పలు ఛానళ్ల కార్యాలయాల ఎదుట, బంజారాహిల్స్ చౌరస్తా, బీఎన్ ఎన్క్లేవ్స్, ఫిలింనగర్ ఇలా పలు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అవినీతి పరుడు, కామపిశాచి అని అన్ని ప్రభుత్వ పథకాల్లో వాటాలు లేనిదే పనులు చేయడని పేర్కొన్నారు.
ఆరిజన్ నిర్వాహకులు ఎమ్మెల్యే చిన్నయ్య లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయనపై వరుసగా ఆరోపణలు చేస్తూ సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన గురించి గడపగడప ప్రచారం నిర్వహిస్తామని, కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తామని ఆరిజన్ నిర్వాహకులు చెబుతున్నారు. తమకు జరిగిన అన్యాయంతో పాటు చిన్నయ్య నిజరూపాన్ని బయటపెడతామని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో, దుర్గం చిన్నయ్య అనుచరులు సైతం దీనిని ధీటుగా తిప్పికొట్టేందుకు సిద్దం అవుతున్నారు. తమ నేతపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే ఎమ్మెల్యేను టార్గెట్ చేశారని స్పష్టం చేస్తున్నారు.
ఏది ఏమైనా ఆరిజన్ వ్యవహారం కాస్తా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు రాజకీయంగా ఇబ్బందులు కలిగిస్తోంది. దీని నుంచి ఆయన ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే.