మరో మహిళ ఆత్మహత్యాయత్నం

నిర్మల్ జిల్లా కేంద్రంలో మరోసారి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఇటీవలే సారంగాపూర్ మండలానికి చెందిన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువకముందే, తాజాగా శివాజీ చౌక్‌లో మరో మహిళ ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. అప్పుల బాధతో భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించిన ఆమెను స్థానికులు అప్రమత్తమై కాపాడారు.

నిర్మల్ పట్టణంలోని రద్దీ ప్రాంతమైన శివాజీ చౌక్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. శివాజీ చౌక్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంపైకి ఎక్కిన సదరు మహిళ, అక్కడి నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా భవనంపైకి చేరుకుని ఆమెను కిందకు దూకకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆమెకు నచ్చజెప్పి, సురక్షితంగా కిందకు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు.

ఈనెల 18న సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీత కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో గొడవపడి శివాజీ చౌక్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం పైకి ఎక్కి ఆత్మహత్యాయ‌త్నం చేసుకుంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆత్మహత్యాయత్నం చేయవద్దంటూ ఫోన్ ద్వారా ఆమెకు నచ్చజెప్పేందుకు ప్ర‌య‌త్నించారు. సుమారు గంట పాటు పోలీసులు, స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎవరైనా దగ్గరకు వస్తే దూకేస్తానని భయపెట్టింది.. చివరకు అన్నంత పని చేసింది. ఆమెను కాపాడేందుకు కొందరు యువకులు బిల్డింగ్ పైకి చేరుకోగా.. అందరూ చూస్తుండగానే భవనంపై నుంచి కిందకు దూకింది.

You might also like