బక్క పలచని యోధుడు… బానిస సంకెళ్ళు తెంచిన కథ
బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ అలుగునూరులో ఏర్పాటు చేసిన “దీక్షా దివస్” స్ఫూర్తి సభలో ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారాయన.. ఇవాళ సింహం తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాళ్లు చెప్పే పిట్టకథలే నిజమని భ్రమపడే ప్రమాదమున్నది.. మన కథ మన తెలంగాణ కథ మనం చెప్పుకోవాల్సిన అవసరమున్నదన్నారు కేటీఆర్. ఇది పాముల కోరలు పీకిన చీమల దండు కథ.. గద్దల తలలు నరికిన కాకుల కథ. ఇది మధపుటేనుగులను బంధించిన గడ్డిపోచల కథ. శిథిలాల నుంచి శిఖరాలను అధిరోహించిన అద్భుత కథ.. మన తెలంగాణ జాతి కథ అన్నారాయన.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల అంత సునాయాసంగా సాకారం కాలేదని.. ఎన్నో పోరాటాలు, బలిదానాల ఫలితంగా చివరకు రాష్ట్రం సిద్ధించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ పెట్టిన కేసీఆర్ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత లక్ష్యాన్ని సాధించారని గుర్తుచేశారు. నిరాహారదీక్ష కొనసాగిస్తే కేసీఆర్ బ్రెయిన్‌డెడ్ అవుతారని తనకు కొందరు పోలీసులు, వైద్యులు చెప్పారని గుర్తుచేశారు. ఎవరెన్ని చెప్పినా వినకుండా మొండి పట్టుదలతో కేసీఆర్ దీక్ష కొనసాగించారని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన మహోద్ధృత ఉద్యమంతో కేంద్రం దిగివచ్చిందన్నారు. తెలంగాణ సాకారం ఎవరి భిక్ష కాదని, యావత్ తెలంగాణ ప్రజల పోరాట ఫలితమని చెప్పారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో విలన్ కచ్చితంగా కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేస్తూ, ఎన్ని యుగాలు గడిచినా ఇదే సత్యమని కేటీఆర్ దుయ్యబట్టారు. గతంలో సోనియా గాంధీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, మన బిడ్డలను బలి తీసుకున్న వారే ఇప్పుడు వేదికలపై ఉద్యమాల గురించి మాట్లాడటం దారుణమని విమర్శించారు. జలియన్ వాలాబాగ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి బ్రిటిష్ పాలకులు సంతాప సభలు పెడితే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో, తెలంగాణ అమరవీరుల గురించి కాంగ్రెస్ మాట్లాడటం కూడా అంతే దరిద్రంగా ఉందని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరూ ఇంత ధైర్యం చేసేవారు కాదని ప్రజలు ఆలోచించాలని కోరారు.
ఆర్.డి.ఎస్., సుంకేసుల బ్యారేజీ విషయంలో గతంలో కేసీఆర్ చూపిన ధైర్యాన్ని గుర్తుచేస్తూ, కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేసి కరీంనగర్‌కు నీళ్లు ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డమైన అబద్ధాలు చెబుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. నీళ్లు అడిగితే బెల్టు ట్రీట్‌మెంట్ ఇస్తామని, చర్లపల్లి జైల్లో పెడతామని రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమో రామచంద్ర అని అలమటించిన తెలంగాణను కేసీఆర్ అన్నపూర్ణగా మార్చారని, కానీ ఇప్పుడున్న పాలకులు ద్రోహుల చేతిలో పడి కథ మళ్లీ మొదటికి వచ్చిందని అన్నారు. కరోనా కంటే డేంజర్‌గా కాంగ్రెస్ మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరుపై పగబట్టి నీళ్లన్నీ కిందికి వదిలేస్తున్నారని, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలిస్తున్నారని విమర్శించారు. 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి కృష్ణా నీళ్లు పోతున్నా, 70 కిలోమీటర్ల లోపు ఉన్న పాలమూరుకు నీళ్లు ఇవ్వడం లేదని కేటీఆర్ దుయ్యబట్టారు.